Thursday, 26 October 2017

సుందర స్వప్నం

చొరవ చేసి చెలీ అని పిలిచి
కలుపుగా కలిసి అలుపు తీర్చి 
సరిక్రొత్త బంధం పెనవేసావు..

కలగనని వైనం కంటికి చూపి
వెన్నెల కూడిన తేజం అందించి
సుందర స్వప్నం అయినావు.. 

ఎడారిలాంటి గొంతు తడార్చి
గుండెలలో సవ్వడి మ్రోగించి  
నన్ను వీడక నాతో ఉన్నావు..

Monday, 9 October 2017

కమ్మని కల

తన తలపుల్లో తనువు తల్లడిల్లే
తలచినదే తడువుగా తను అగుపడ  
తన్మయత్వపు తమకంలో తనువు తడిసె
తనలో నేను నాలో తను ఏకమవ్వాలని
జగమును మరిచి తరించాలని..
కోరికలు ఎన్నో తలపులలో తిడిగాడె 
తన కోసం నేను నాకోసం తను 
పుట్టామని మనసు గట్టిగా పలికె
కలలోనైనా తీరు అమేయముగా తోచె
కమ్మని కల నిజమైతే ఎంత మధురమో!

Thursday, 28 September 2017

కల

కలయైనా నిజమైనా నిరాశలో ఒకటే

పగలైనా రేయైనా అంధునికి ఒకటేలే

Monday, 11 September 2017

ఆసరా

నాకూ తెలుసునులే..
కంటున్నవీ కనబోయే కలలు
కల్పితాలనీ, ఆశలు అసంకల్పితమనీ
అయినా జీవించడానికి ఏవో కొన్ని
అభూత కల్పనలు ఆసరా కావాలి కదా!  

Saturday, 2 September 2017

కలతో ఆట

తాళ్ళతో బంధించినా సరే ఎందుకో
మనసు ముందుకు పరుగులిడుతుంది
కలలతో ఆడుతూనే నిదురించి 
లేస్తుంది...లేచి పరుగులెడుతుంది!
రాత్రంతా స్వప్నాల్లో మేల్కొని జాగారం చేసి 
పగలు అలసి అలకచెంది సాగనన్నది
సంధ్యవేళలో గుర్తించనట్లు నటిస్తూ
జ్ఞాపకాలు మళ్ళీ ఊపిరిపోసుకుంటున్నాది
కనులు చెమ్మగిల్లి సరిహద్దు లేని కన్నీటిలో 
కలలు కరిగిపోయి కొత్తకలతో ఆడుకోవాలని 
నిదురించే ప్రయత్నం చేస్తుంది మనసు.. 
కలతో ఆడుకుంటూ నిదురిస్తున్నాను నేను..

Wednesday, 30 August 2017

నా స్వప్నాలు

కన్నుల వెనుక స్వప్నంలో
మాటల వెనుక మౌనంగా
శ్వాస వెనుక స్పందనలా
విజయం వెనుక శ్రమవలె
గమ్యం వెనుక పయనమై
ఉండేవే నా కలలు ఊహలు