Friday 1 February 2019

కలువ

చీకటి కోనేరులో విరిసిన కలువను
పచ్చనోటు చూసి పైట తొలగిస్తాను 
పక్కదారిలో పయనించే  ప్రతిమగవాడికీ
సొగసుల పువ్వులు సరసంగా అందిస్తాను 
మోసానికి గురై వంచన వలలో చిక్కాను 
చాలీచాలని అతుకుల బ్రతుకు కూడదని 
పిల్లలకు చాలీ చాలని తిండితో చంపలేక
వలపుఅంగట్లో అమ్ముడై బ్రతుకుతున్నా..

Friday 4 January 2019

నీ జాడ

జగతి సుందరమనోహరం అయితే నీవందు లేవేలనో 
సూర్యచంద్రులు వచ్చిపోతున్నారు నీ జాడ లేదాయె
నీ నీడకై అలుపులేని నాపయనం సాగిస్తుంటినాయె
దాహార్తితో సాగుతున్న పయనం ఎన్నటికి కడతేరేనో 
దూరమెంత దగ్గరాయెనో మనసులంత దూరమాయె
సమయపు ఇసుకతిన్నెపై పేర్లు వ్రాసి వెళ్లిపోతివాయె
దక్కకచేజారిన వలపే స్వచ్ఛమైనదని నిరూపిస్తివాయె
నింగీ నేలలా కలవక అసంపూర్తిగానే మిగిలిపోతిమాయె!