Monday, 13 July 2020

కలలు కన్నా..

ఎన్నో ఊహలు ఊహించి 
ఏవేవో కలలు కన్నాను..
నీవు నేను ఒకటిగా ఏకమై
పయనించాలని తపించాను!
పల్లవి అనుపల్లవి తోడైతే 
రసరాగం పాడాలని అనుకుని
ఏవేవో కలలు కన్నాను నేను! 

Sunday, 21 June 2020

కలలు

నిశ్చింతగా నిదురపోతే కలలు వస్తాయి
వచ్చిన కలలు ఆనందాన్ని ఇస్తాయి..  
కలలు ఎప్పుడూ కమ్మగానే ఉంటాయి
కష్టాలను రుచి చూడవేమో అందుకని..
నిదురరాని కనులకు కలలు కూడా రావు 
అలసిన కనులు కళను కోల్పోతాయి.. 

Monday, 25 May 2020

మార్పు

ప్రతీవేకువా ఓ వసంతకాలం
బిజీగా మొదలౌతుందిపగలు
అలసటతో వచ్చే సాయంత్రం
రాత్రితో దొరికే దానికి విశ్రామం 
ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినా
ఎంత కన్నీళ్లతో దిండు తడిచినా
మరో ఉదయం రాక మానదు.. 
మళ్ళీ మనం వసంతకాలం చూడకపోము!

Friday, 1 February 2019

కలువ

చీకటి కోనేరులో విరిసిన కలువను
పచ్చనోటు చూసి పైట తొలగిస్తాను 
పక్కదారిలో పయనించే  ప్రతిమగవాడికీ
సొగసుల పువ్వులు సరసంగా అందిస్తాను 
మోసానికి గురై వంచన వలలో చిక్కాను 
చాలీచాలని అతుకుల బ్రతుకు కూడదని 
పిల్లలకు చాలీ చాలని తిండితో చంపలేక
వలపుఅంగట్లో అమ్ముడై బ్రతుకుతున్నా..

Friday, 4 January 2019

నీ జాడ

జగతి సుందరమనోహరం అయితే నీవందు లేవేలనో 
సూర్యచంద్రులు వచ్చిపోతున్నారు నీ జాడ లేదాయె
నీ నీడకై అలుపులేని నాపయనం సాగిస్తుంటినాయె
దాహార్తితో సాగుతున్న పయనం ఎన్నటికి కడతేరేనో 
దూరమెంత దగ్గరాయెనో మనసులంత దూరమాయె
సమయపు ఇసుకతిన్నెపై పేర్లు వ్రాసి వెళ్లిపోతివాయె
దక్కకచేజారిన వలపే స్వచ్ఛమైనదని నిరూపిస్తివాయె
నింగీ నేలలా కలవక అసంపూర్తిగానే మిగిలిపోతిమాయె!